Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Friday, 7 August 2026

Gorintaku Panduga 2026 at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా గోరింటాకు పండుగ:

ఈరోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఉపాధ్యాయులు చందన, సంగీతల ఆధ్వర్యంలో గోరింటాకు పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ వేడుకల్లో విద్యార్థులు తమ ఇళ్ల నుంచి తెచ్చిన తాజా  గోరింటాకులను మెత్తగా దంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ  అరచేతుల్లో చందమామ లాంటి వృత్తాకారంలో, చేతి వేళ్లకు రెండు భాగాలు పెట్టుకోవడం జరిగింది. కొద్దిసేపు తర్వాత చేతులను కడుక్కున్నారు. అందరి చేతులు ఎర్రగా అందంగా మారాయి, ఇది చూసి విద్యార్థులు ఎంతో ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

ఆషాడ మాసంలో జరుపుకునే ఈ పండుగ ప్రత్యేకతను, గోరింటాకు పెట్టుకోవడం వల్ల చేతులు ఎర్రగా మారడానికి గల కారణాలను, కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు.

గోరింటాకు (మెహందీ) పెట్టుకున్నప్పుడు చేతులు ఎరుపు/నారింజ లేదా ముదురు గోధుమ రంగులోకి మారడానికి ప్రధాన కారణం అందులో ఉండే లాసోన్ (Lawsone) అనే సహజ వర్ణద్రవ్యం.

🌿 రంగు ఎలా వస్తుంది?

1. గోరింటాకు ఆకుల్లో Lawsone అనే సహజ రంగు పదార్థం ఉంటుంది.

2. గోరింటాకు పేస్ట్‌ను చేతులకు పెట్టినప్పుడు Lawsone చర్మంలోని కెరాటిన్ అనే ప్రోటీన్‌తో బంధిస్తుంది.

3. మొదట రంగు లేత నారింజగా కనిపిస్తుంది.

4. కొన్ని గంటల్లో ఆక్సీకరణ జరిగి రంగు ఎరుపు → ముదురు ఎరుపు/గోధుమగా మారుతుంది.

5. సాధారణంగా చేతుల అరచేతుల్లో రంగు ఎక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ చర్మంలోని కెరాటిన్ పొర మందంగా ఉంటుంది.

గోరింటాకు చేతులకు పెట్టుకోవడం వల్ల సౌందర్యంతో పాటు కొన్ని పరిమితమైన చర్మ ప్రయోజనాలు ఉన్నవి.

🌿 గోరింటాకు వల్ల ప్రయోజనాలు

  1. చేతులకు సహజమైన రంగు – గోరింటాకులోని Lawsone వల్ల అందమైన ఎరుపు/గోధుమ రంగు వస్తుంది.

  2. చర్మానికి చల్లదనం – గోరింటాకు పేస్ట్ చర్మంపై ఆరేటప్పుడు చల్లగా అనిపిస్తుంది.

  3.  స్వల్ప యాంటీమైక్రోబయల్ లక్షణాలు – గోరింటాకులోని కొన్ని పదార్థాలు కొన్ని సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించే లక్షణాలు ప్రయోగశాల స్థాయిలో చూపించాయి.

  4. చర్మంలోని నూనెను కొంత తగ్గించవచ్చు – పేస్ట్ ఆరే సమయంలో చర్మం కొద్దిగా పొడిగా అనిపిస్తుంది.

  5. గోళ్లకు రంగు – గోళ్లకు పెట్టుకుంటే సహజమైన ఎరుపు/నారింజ రంగు వస్తుంది.

  6. జుట్టుకు కూడా ఉపయోగిస్తారు – సహజ హెన్నాను జుట్టుకు రంగు కోసం ఉపయోగిస్తారు; ఇది జుట్టును కండిషన్ చేసినట్లు అనిపిస్తుంది.

Saturday, 18 July 2026

Parent Teacher Meeting on 18th July 2026 at MPPS Uppununthala Boys

 

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో  ఘనంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం(పీటీఎం):

ఈరోజు ఉదయం 9:30 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాలలో ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం(పీటీఎం)   ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడం, నాణ్యమైన విద్యను అందించడం, తల్లిదండ్రుల బాధ్యతలు, విద్యార్థుల ప్రగతి, పూర్వ ప్రాథమిక తరగతులు, మధ్యాహ్న భోజనం తదితర అంశాల గురించి చర్చించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు,  ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన,  సంగీత, పూర్వ ప్రాథమిక తరగతి సిబ్బంది అలివేలు, రాధికలు మాట్లాడుతూ పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్య, ప్రతి సంవత్సరం సాధిస్తున్న గురుకుల సీట్లు, వసతులను వివరించి విద్యార్థుల సంఖ్య 104 ను మరింతగా పెంచేలా తల్లిదండ్రులు గ్రామ ప్రజలను చైతన్యం చేయాలని కోరడం జరిగింది. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, విద్యా ప్రగతి గురించి ఉపాధ్యాయులతో చర్చించడం జరిగింది. అనంతరం తల్లిదండ్రులతో బాధ్యతల వాగ్దానం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ జాకటి గీత, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Monday, 29 June 2026

School Bags Distribution at MPPS Uppununthala Boys 2026 By Maryada Foundation

మర్యాద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగుల పంపిణీ: ముఖ్యఅతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు





ఈరోజు ఉదయం 11 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యా యులు శ్రీనివాసులు అధ్యక్షతన 

స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించడం జరిగింది. ఉపాధ్యాయులు గాజుల  వెంకటేష్ మాట్లాడుతూ ఇక్కడికి 2018 లో బదిలీపై వచ్చినప్పుడు 25 మంది విద్యార్థులతో వసతుల లేమితో ఈ పాఠశాల మూతపడే స్థితిలో ఉన్నదని, తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి, దాతల సహకారంతో వసతులు సమకూర్చుకుని, నా ఇద్దరు పిల్లలను ఇదే పాఠశాలలో చేర్పించి, విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందిస్తూ గురుకుల ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేకత తరగతులు నిర్వహించి ప్రతి సంవత్సరం గురుకుల సీట్లు సాధిస్తూ ఇప్పటివరకు 56 సీట్లు సాధించడం జరిగింది. తల్లిదండ్రులు ఈ ఫలితాలను చూసి వారి పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించడం జరుగుతుందని ఇప్పటివరకు విద్యార్థుల సంఖ్యను 102 కు పెంచడం జరిగిందని వివరించారు. 

ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఉపాధ్యాయులందరం బట్టి విధానంలో కాకుండా కృత్యాధార పద్ధతిలో ఆటపాటలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలియజేశారు. బ్యాగుల పంపిణీ చేస్తున్న మర్యాద ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థుల సంఖ్యకు  అనుగుణంగా రెండు అదనపు తరగతి గదులు, టాయిలెట్స్, తాగునీరు వసతులు కల్పించాలని గౌరవ శాసనసభ్యులను కోరడం జరిగింది. 

మర్యాద ఫౌండేషన్ కోఆర్డినేటర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ తాము ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గొప్ప స్థాయికి చేరుకోవడం జరిగిందని, మా అన్న వాళ్ళు మర్యాద శ్రీనివాస్ రెడ్డి, మర్యాద కృష్ణారెడ్డి లు అమెరికాలో స్థిరపడ్డారని తెలియజేశారు. సమాజానికి తిరిగి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మర్యాద ఫౌండేషన్ స్థాపించి ముఖ్యంగా విద్యాభివృద్ధికి  సహకరిస్తున్నమని ఈ సంవత్సరం ఉప్పునుంతల గ్రామపంచాయతీ పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు 200 స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. గత రెండు సంవత్సరాలలో కూడా విద్యార్థులు అందరికీ బూట్లు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశామని తెలియజేశారు. 

ముఖ్య అతిథులుగా హాజరైన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు మాట్లాడుతూ మూతపడే స్థితిలో ఉన్న పాఠశాలను ఉపాధ్యాయులందరూ సమిష్టి కృషితో అంకితభావంతో పనిచేసి విద్యార్థుల సంఖ్యను 25 నుండి 102 కి  పెంచడం అభినందనీయమని ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు. తాను పనిచేసే పాఠశాలలోనే తన ఇద్దరు పిల్లలను చేర్పించిన ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ ని ప్రత్యేకంగా అభినందించారు. విద్యాభివృద్ధికి సహాయ సహకారాలు అందించడంలో భాగంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేస్తున్న మర్యాద ఫౌండేషన్ ప్రతినిధులను అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని, విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు, బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, తెలంగాణ మోడల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ యంగ్ ఇండియా పాఠశాలలు స్థాపించి నాణ్యమైన విద్యను అందించాలని కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. 

గౌరవ ఎమ్మెల్యే గారు విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందజేశారు. 

అనంతరం గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారిని, మర్యాద ఫౌండేషన్ ప్రతినిధులు మర్యాద కృష్ణారెడ్డి గారిని, వెంకట్ రెడ్డి గారిని, నూతన మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి గారిని పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చింతగాల్ల శ్రీనివాసులు, ఉప సర్పంచ్ శైలజ , గ్రామ పెద్దలు డిసిసి ఉపాధ్యక్షులు కట్ట అనంత రెడ్డి, తహసిల్దార్ సునీత, నాయకులు తిప్పర్తి నరసింహారెడ్డి, మల్ రెడ్డి వెంకట్ రెడ్డి, పాత్కుల రామచంద్రయ్య, ఆలూరి శ్రీనివాసులు, పాత్కుల నిరంజన్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Thursday, 23 April 2026

Annual Day Celebrations 2026 at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా వార్షిక దినోత్సవం:

ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన వార్షిక దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో ముందుగా  ప్రధానోపాధ్యాయులు, అథితులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత, ఆంజనేయులు మహనీయుల చిత్ర పటాలకు పూల దండలు వేశారు.

విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో నేర్చుకున్న విషయాలు, గురుకుల సీట్లు సాధించడానికి చేసిన కృషిని, ఉపాధ్యాయులు అందించిన సహకారాన్ని, మిత్రులతో, ఉపాధ్యాయులతో వారికున్న అనుభూతులను పంచుకున్నారు. తరువాత ప్రధానోపాధ్యాయులు పాఠశాల ప్రగతి నివేదికను తెలియచేస్తూ ఈ సంవత్సరం 8 మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారని, ఇప్పటి వరకు గత ఎనిమిది సంవత్సరాల్లో మొత్తం 57 గురుకుల సీట్లు విద్యార్థులు సాధించారని, వారికి గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, ఆంగ్ల మాధ్యమంలో 1 నుంచి 5వ తరగతి వరకు కృత్యాధార పద్దతిలో విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం మన పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్య నర్సరీ, ఎల్ కేజీ, యూ కేజీ తరగతులను కూడా ప్రభుత్వ ఆదేశానుసారం ప్రవేశ పెడుతున్నాము కాబట్టి మన ఊరి పిల్లలు అందరినీ మన ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని కోరారు. తర్వాత ఉపాధ్యాయులు వెంకటేష్ గారు మాట్లాడుతూ దాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి పాఠశాలకు కావాల్సిన వనరులు సమకూర్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్యను అందిస్తున్నామని, నా రెండవ కుమారుడు రాహుల్ ని కూడా ఇదే పాఠశాలలో చదివిస్తున్నానని, ఇక్కడ సుదీర్ఘ అనుభవం, విషయ నిపుణులు అయిన ఉపాధ్యాయులు ఒత్తిడి లేకుండా, స్వేచ్ఛ పూరిత వాతావరణంలో బోధనోపకరణాలతో అర్థవంతంగా బోధించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ గ్రామ విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు.

అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన గౌరవ గ్రామ సర్పంచ్ చింతగల్ల శ్రీనివాసులు గారు మాట్లాడుతూ గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులు పాత్కుల రిషిత్, ఆలూరి చంటి, పాత్కుల కౌశిక్ కుమార్, నడిగడ్డ విఘ్నేష్, మధనాగుల అలేఖ్య, ఆలూరి హర్బిక, పొట్టల శ్రీనిధి, గోరటి మాధవి లను అభినందించి జ్ఞాపికలను అందచేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్యను ఇంగ్లీష్ మీడియంలో అందించి సుమారు 60 మంది విద్యార్థులను గురుకులాలకు పంపించడం చాలా గొప్ప విషయమని, దానికి కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించడం జరిగింది. ఈ పాఠశాల అభివృద్ధికి అన్ని రకాలుగా సహాకారం అందిస్తామని తెలియజేశారు. విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదిగి సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

అనంతరం నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు వీరాస్వామి, రామచంద్రయ్య, శ్రీనివాసులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Monday, 13 April 2026

Babasaheb Dr BR Ambedkar's 135th Birth Anniversary Celebrations at MPPS Uppununthala Boys

ఘనంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం:
ఈ రోజు ఉదయం 11 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం వారి చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, ఆంజనేయులు, చందన లు మాట్లాడుతూ అంబేద్కర్ గారు విద్య ద్వారా గొప్ప స్థాయికి ఎదిగిన తీరును, వారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు . అంబేద్కర్ గారిని బడిలోకి రానివ్వకున్న గుమ్మం బయట కూర్చోని ఎన్నో అవమానాలను, కష్టాలను ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో శ్రద్ధగా చదువుకుని, విదేశాలకు వెళ్ళి ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లలో ఉన్నతంగా చదువుకుని ప్రపంచ మేధావిగా ఎదిగి భారత దేశంలోని కుల వివక్షతకు, లింగ వివక్షతకు, అసమానతలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి, రాజ్యాంగం ద్వారా భరత దేశ ప్రజలు అందరూ ఎదిగే విధంగా అందరికీ అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం ఉండే విధంగా అవకాశాలను, హక్కులను కల్పించి కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకాలను అందజేశారు.

Saturday, 11 April 2026

Jyothi Rao Phule's 199th Birth Anniversary Programme at MPPS Uppununthala Boys

ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 199వ జయంతి: 

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 199వ జయంతి కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా ఫూలే గారి చిత్ర పటానికి పూలమాలతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్, చందన, సంగీత లు జ్యోతిరావు ఫూలే గారి గురించి విద్యార్థులకు వివరిస్తూ వారు అందరికీ విద్యను అందించడానికి తన బార్య సావిత్రి భాయి ఫూలేతో కలిసి 1848 వ సంవత్సరంలో బాలికల కోసం, సమాజంలోని నిమ్న వర్గాల కోసం స్వాతంత్ర్యానికి పూర్వమే 52 పాఠశాలలు స్థాపించి విద్యా వ్యాప్తికి కృషి చేసిన విద్యా వేత్త అని, 1873 సంవత్సరంలో సత్యశోధక సమాజ్ ను స్థాపించి లింగ వివక్షతకు, కుల వివక్షతకు, సమాజంలోని అసమానతలకు, బాల్య వివాహాలకు, సతీసహగమనం కు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన సామాజిక విప్లవకారులు అని వారి సేవలను కొనియాడారు. వారిని స్పూర్తిగా తీసుకుని విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Tuesday, 24 March 2026

Our students got gurukula seats in V TGCET 2026

గురుకుల ఫలితాల్లో 8 సీట్లు సాధించిన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులు:

5వ తరగతి గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2026 మొదటి విడత ఫలితాల్లో మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల నుండి ఎనిమిది మంది విద్యార్థులు పాత్కుల రిషిత్ కుమార్, పాత్కుల కౌశిక్, నడిగడ్డ విగ్నేష్, ఆలూరి చంటి, పొట్టల శ్రీనిధి, మధనాగుల అలేఖ్య, గోరటి మాధవి, ఆలూరి హర్బిక లు గురుకుల సీట్లు సాధించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్ , ఆంజనేయులు సార్ , చందన మేడం, సంగీత మేడం లు విద్యార్థులను అభినందించి బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదిగి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు గురుకుల ప్రవేశ పరీక్ష కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు గురుకుల మెటీరియల్ అందించిన బహుజన ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు టీచర్ విజయ్ కుమార్ సార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ సార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్ లు విద్యార్థులకు అభినందనలు తెలియజేసి ఉపాధ్యాయుల కృషిని ప్రశంసించారు.

Wednesday, 11 March 2026

Self Government Day 2026 at MPPS Uppununthala Boys

 బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం:


ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 25 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాఠశాల విధులు నిర్వహించారు. కలెక్టర్ గా వరున్ తేజ్, డీఈవో గా యశ్వంత్, ఎం.ఈ.ఓ గా అలేఖ్య, కాంప్లెక్స్ హెచ్.ఎం గా చంటి, ప్రధానోపాధ్యాయులు గా శ్రీజ లు వ్యవహరించారు. ఛాత్రోపాధ్యాయులుగా విద్యార్థులు చేసిన బోధనా కౌశలాలను ముఖ్య అతిథులుగా హాజరైన ఉప్పునుంతల మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ సార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్ పరిశీలించి వారికి అభినందనలు తెలియజేసి, మీరు ఈ రోజు పొందిన ఆనందం భవిష్యత్తులో పొందాలంటే బాగా చదువుకుని మీ లక్ష్యాలను సాధించాలని ఆశీర్వదించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, ఆంజనేయులు, చందన, సంగీత లు విద్యార్థులను అభినందించి, బహుమతులు అందచేశారు. జిల్లా తనిఖీ బృందం అధికారి కేతావత్ బిచ్య నాయక్, సభ్యులు రవిందర్ పాఠశాలను సందర్శించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Monday, 26 January 2026

77th Republic Day Celebrations at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు:

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం 6:30 గంటలకు దేశభక్తిని చాటుతూ, రాజ్యాంగ నిర్మాతలను, స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి గీతాలు పాడుతూ విద్యార్థులు జాతీయ నాయకుల వేషాధారణలో గ్రామ వీధుల గుండా ప్రభాత భేరి నిర్వహించారు.

ఉదయం 8:30 గంటలకు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో విద్యార్థులు రాజ్యాంగం గురించి ఉపన్యాసాలు ఇచ్చారు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, ఆంజనేయులు సార్, చందన మేడం, సంగీత మేడం లు రాజ్యాంగం గొప్పతనాన్ని, పౌరులు అందరూ సమానంగా ఎదగడానికి వారికి కల్పించిన హక్కులను, విధులను, సామాజిక న్యాయం, సమాజ అభివృద్ధి కోసం నిర్దేశించిన ఆదేశిక సూత్రాలను వివరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన గ్రామ సర్పంచ్ చింతగాళ్ళ శ్రీనివాసులు, ఉప సర్పంచ్ అంతటి శైలజ వెంకటయ్య గౌడ్, వార్డు సభ్యులు జాకటి గీత, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు, మాజీ యంపిటిసీ సైదమ్మ రామచంద్రయ్య, యువజన నాయకులు భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

కంప్యూటర్ ల్యాబ్ లో ఇన్వర్టర్ ఏర్పాటు కోసం సర్పంచ్ శ్రీనివాసులు గారు 10 వేల రూపాయలు, మాజీ యంపిటిసీ సైదమ్మ రామచంద్రయ్య గారు 5 వేల రూపాయలు, ఉప సర్పంచ్ అంతటి శైలజ వెంకటయ్య గౌడ్ గారు 5 వేల రూపాయలు, యువజన నాయకులు భాస్కర్ గారు 10 వేల రూపాయలు ప్రకటించడం జరిగింది. వారికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేశారు.



నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సర్పంచ్ , ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాతో సన్మానించి, అభినందించడం జరిగింది.

అనంతరం ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి బహుమతులు అందచేశారు.



Tuesday, 23 December 2025

5th Gurukula Entrance Material Distribution on the occasion of National Farmer's Day 2025 at MPPS Uppununthala Boys

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష మెటీరియల్ వితరణ: 

 ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ రైతు దినోత్సవాన్ని సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు సంగీత మాట్లాడుతూ రైతు నాయకులు, దేశ 5వ ప్రధాని చరణ్ సింగ్ గారు రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని అందుకే ఆయన పుట్టిన రోజున జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, రైతులు ఎన్నో కష్టనష్టాలను, కన్నీళ్ళను ఎదుర్కొని పంటలు పండించడం ద్వారా మనకు ఆహారం లభిస్తుందని, వారి గొప్ప సేవలు, త్యాగాలు దేశ ఆర్థికాభివృద్ధిలో, దేశ ప్రజల ఆకలి తీర్చడంలో వెలకట్టలేనివని, మా తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు అందరూ రైతులే అని వారి కృషి వల్లనే మనం ఈ స్థాయిలో ఉన్నామని అందుకే రైతులను మనందరం గౌరవించాలని, వారి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం బహుజన ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి టీచర్ విజయ్ కుమార్ సార్ అందించిన గురుకుల మెటీరియల్ ను విద్యార్థులకు అందజేశారు. సార్ కి కృతజ్ఞతలు తెలిపారు. వీటిని ఉపయోగించుకొని గురుకుల సీట్లు సాధించాలని కోరారు.

National Mathematics Day 2025 Programme at MPPS Uppununthala Boys

 ఘనంగా జాతీయ గణిత దినోత్సవం: 

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో గొప్ప గణిత శాస్త్ర వేత్త శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రామానుజన్ గారి చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించారు, అనంతరం ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు చందన లు మాట్లాడుతూ రామానుజన్ గారు గణితం పైన మక్కువతో సంఖ్యా సిద్ధాంతం, అనంత శ్రేణులు, గణిత విశ్లేషణ వంటి రంగాలలో అద్భుతమైన కృషి చేసి ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరచారు, 32 సంవత్సరాల చిన్న వయస్సులోనే మరణించారు, కానీ 1729 వంటి సంఖ్యల ద్వారా చిరస్మరణీయులయ్యారు. వారు ప్రతిపాదించిన సిద్ధాంతాల పైనా నేటికీ ఎందరో పరిశోధనలు చేస్తున్నారని అన్నారు. వారి స్పూర్తితో విద్యార్థులు గణితం తో పాటు అన్ని విషయాలు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

Saturday, 20 December 2025

International Meditation Day Programme 2025 at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అంతర్జాతీయ ధ్యానం దినోత్సవం:

డిసెంబర్ 21 రేపు ఆదివారం కావడంతో ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అంతర్జాతీయ ధ్యానం దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, ఉపాధ్యాయులు చందన, సంగీత లు మాట్లాడుతూ ధ్యానం చేయడం ద్వారా మనస్సు ను అదుపు చేయవచ్చు అని, తద్వారా ఏకాగ్రత పెరుగుతుంది అని, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ సమతుల్యత ఏర్పడి సంకల్ప శక్తి అభివృద్ధి చెందుతుందని, ప్రశాంతత ఏర్పడుతుంది అని తెలియజేశారు. విద్యార్థులు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ధ్యానం చేయాలని తద్వారా ఏకాగ్రత పెరిగి చదువు లో రాణించవచ్చు అని తెలియజేశారు. ధ్యానంతో నిన్ను నీవు తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది అని, మన బలాలు, బలహీనతలు తెలుసుకొని, చెడు అలవాట్లు దూరం చేసుకొని మంచి వ్యక్తిగా మారుతారని ఇన్ని ప్రయోజనాలు ఉన్న ధ్యానం ను అందరూ ఆచరించాలని సూచించారు. విద్యార్థులు పాల్గొన్నారు.


 

Nutritious Food Festival at MPPS Uppununthala Boys in the PTM

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా పోషక ఆహారోత్సవం:

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం(పిటిఎం) ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పౌష్టికాహారం ప్రాధాన్యతను తెలియజేయడానికి పోషక ఆహారోత్సవం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధాన ఉపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, ఉపాధ్యాయులు చందన, సంగీత లు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి పౌష్టికాహారం అందించాలని, పౌష్టికాహారం అనగా పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండే పదార్థాలు పాలు, పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, చిరుధాన్యాలు, పప్పులు, మాంసం, గుడ్లు, మొలకెత్తిన గింజలు, డ్రై ఫ్రూట్ మొదలైన వాటిని సమపాళ్లలో తీసుకోవాలని సూచించారు. స్థూల పోషకాలు అయిన పిండి పదార్థాలు 60%, మాంసకృత్తులు 15%, క్రొవ్వులు 25% తీసుకోవాలని, వీటితో పాటు సూక్ష్మ పోషకాలు విటమిన్లు, ఖనిజ లవణాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి అని తెలియజేశారు. దీన్నే సమతుల ఆహారంగా చెప్తారు. పౌష్టికాహారం అందించడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థలకు వారానికి మూడు గుడ్లు, రాగి జావ, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది అని తెలియజేశారు. విద్యార్థులు జంక్ ఫుడ్ తినకుండా, ఇంట్లో చేసిన తాజా ఆహారం తీసుకోవాలి అని సూచించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇంటి వద్ద చేసుకొని వచ్చిన పోషకాలు కలిగిన, రుచికరమైన వంటకాలను ప్రదర్శించి,వాటి తయారీ విధానం, ఉపయోగాలు వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Saturday, 6 December 2025

Babasaheb Dr BR Ambedkar's 69th death anniversary programme at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమం:

 ఈ రోజు ఉదయం 11 గం.లకు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంగీత అంబేద్కర్ గారు విద్యా గొప్ప స్థాయికి ఎదిగిన తీరును, వారు దేశానికి చేసిన సేవలను వివరిస్తూ అంబేద్కర్ గారిని బడిలోకి రానివ్వకున్న గుమ్మం బయట కూర్చోని ఎన్నో అవమానాలను, కష్టాలను ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో శ్రద్ధగా చదువుకుని, విదేశాలకు వెళ్ళి ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లలో చదువుకుని ప్రపంచ మేధావిగా ఎదిగి భారత రాజ్యాంగం రాసి అందులో భరత దేశ ప్రజలు అందరూ ఎదిగే విధంగా అందరికీ అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం ఉండే విధంగా అవకాశాలను, హక్కులను కల్పించి నా లాంటి కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Thursday, 4 December 2025

Indian Navi Day Celebrations at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా భారతదేశ నౌకాదళ దినోత్సవం:

ఈ రోజు ఉదయం 11గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ అద్యక్షతన భారత దేశ నౌకాదళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ భారత దేశాన్ని కాపాడుతున్న త్రివిధ దళాలైన సైనిక దళం, నౌకాదళం, వైమానిక దళాల్లో నావికా దళం ప్రధానమైనదని ఇది భారత దేశ తీర ప్రాంతం గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు 11 వేల 98 కిలోమీటర్ల మేర దేశాన్ని శత్రు దేశాల నుంచి నిత్యం కాపాడుతుంది అని భారత దేశ పటాన్ని చూపిస్తూ వివరించడం జరిగింది.



పాకిస్థాన్ తో జరిగిన యుద్ధం విజయం సాధించడంలో 1971 డిసెంబరు 4 భారత నేవీ అతిపెద్ద పాకిస్తానీ నౌకాశ్రయం కరాచి పోర్టుపై మెరుపుదాడి చేసిమూడు ఓడలను ముంచి వేసింది. 1971ఇండో-పాక్ యుద్ధం రాత్రి సమయంలో భారత్ చేసిన ఆ దాడిని ఆపరేషన్ ట్రైడెంట్ అని అంటారు. దాని జ్ఞాపకార్ధంగా భారతదేశంలో నావికా దళ దినోత్సవం జరుపుకుంటున్నామని విద్యార్థులకు వివరించారు. దేశ రక్షణ కోసం నావికా దళంలో పనిచేసిన సైనికుల త్యాగాలను గౌరవించాలని సూచించారు. వారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Wednesday, 3 December 2025

World Disability Day Programme 2025 at MPPS Uppununthala Boys

ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం:

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని ఉప్పునుంతల మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ గారు అన్నారు.

బుధవారం బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు జటప్రోలు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ దివ్యాంగులు ప్రభుత్వం అందించే అన్ని రకాల విద్యా సదుపాయాలని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిచ్యా నాయక్ మాట్లాడుతూ దివ్యాంగులు కూడా సాధారణ పిల్లలవలె సాధారణ పాఠశాలలో చదువుకునే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు.అనంతరం ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు కడుకుంట్ల రాజవర్ధన్ రెడ్డి మరియు సంగీత , విజయ్ కుమార్ లు మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రభుత్వం విద్యాపరంగా కల్పిస్తున్న సౌకర్యాలను మరియు రాయితీల గురించి తెలిపారు. అనంతరం వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి చంద్రశేఖర్ గారు, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు జటప్రోలు శ్రీనివాస్ రెడ్డి గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిచ్యా నాయక్ మరియు ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు రాజవర్ధన్ రెడ్డి, సంగీత, ఐఈఆర్ పి విజయ్ కుమార్, చందన, ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ తిరుపతి, సి ఆర్ పి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 2 December 2025

National Pollution Control Day 2025 at MPPS Uppununthala Boys

జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ఉపాధ్యాయులు & విద్యార్థులు:

ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు బాలురు ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, ఉపాధ్యాయులు చందన, సంగీత లు మరియు విద్యార్థులు పాఠశాల ప్రహరీ గోడ వెంబడి మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను తరగతి వారిగా విద్యార్థులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా మూడు రకాల కాలుష్యాలు వాటి నియంత్రణ మార్గాలను విద్యార్థులకు వివరిస్తూ భూమి కాలుష్యం నివారణకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, వాయు కాలుష్య నివారణకు మొక్కలు పెంచాలని, జల కాలుష్య నివారణకు వ్యర్థ పదార్థాలను నీటిలో కలుపొద్దని, ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చెట్లు కార్బన్ డయాక్సైడ్ ను తీసుకుని మనకు అవసరం అయ్యే ఆక్సిజన్ ను ఇస్తాయని, వర్షాలు కురవడానికి ఎంతో ఉపయోగపడుతాయని, వాతావరణ సమతుల్యతకు దోహదం చేస్తాయని వివరించారు. అందుకే చెట్లను నరుకొద్దని, వాటిని మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని తెలియజేశారు. కాలుష్యం నుంచి ప్రకృతి ని రక్షించి భావి తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని, అందరూ పర్యావరణం పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.



Saturday, 29 November 2025

Spell bee competition conducts on 29/11/2025, Saturday

ఇంగ్లీష్ భాషాభివృద్ధి కోసం స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ నిర్వహణ:

ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో శనివారం సందర్భంగా విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై అవగాహన పెంపొందించడానికి విద్యార్థులను ఐదు గ్రూపు లుగా చేసి వారికి స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రతిభ కనబరిచిన ఆలూరి శ్రీజ గ్రూప్ సభ్యులు బొల్లె చక్రవర్తి, మధనాగుల ప్రవీణ్, మధనాగుల మీనాక్షి, మధనాగుల శ్రుతి, బొల్గం మినీశ్వర్, పాత్కుల ఆర్య మొదటి బహుమతి పొందారు, వీరికి ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు అభినందనలు తెలియజేసి, పెన్సిల్ లు బహుమతిగా అందజేశారు. మిగతా గ్రూపు విద్యార్థులు నిరాశ చెందకుండా తరువాత జరగబోయే కాంపిటీషన్ లో విజయం సాధించేలా చదువుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ వల్ల విద్యార్థుల్లో ఇంగ్లీష్ పదజాలం అభివృద్ధి చెంది భాషపై అవగాహన పెరుగుతుంది అన్నారు. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో ఇంగ్లీష్ భాష ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో బాగా చదువుకుని రాణించాలంటే ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించి భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Friday, 28 November 2025

Mahathma Jyothi Rao Phule's 135th death anniversary programme at MPPS Uppununthala Boys

 విద్యా వ్యాప్తికి కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 135వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు:

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 135వ వర్ధంతి కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా పూలే గారి చిత్ర పటానికి పూలతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే గారు అందరికీ విద్యను అందించడానికి తన బార్య సావిత్రి భాయి కి చదువు నేర్పి, ఆమెతో కలిసి 1848 వ సంవత్సరం నుంచి బాలికల కోసం, సమాజంలోని నిమ్న వర్గాల కోసం స్వాతంత్ర్యానికి పూర్వమే 52 పాఠశాలలు స్థాపించి, ఎన్నో అవమానాలను, అడ్డంకులను, కుట్రలను ఎదుర్కొని విద్యా వ్యాప్తికి కృషి చేసిన విద్యా వేత్త అని, వారు 1873 సంవత్సరంలో సత్యశోధక సమాజ్ ను స్థాపించి లింగ వివక్షతకు, కుల వివక్షతకు, సమాజంలోని అసమానతలకు, బాల్య వివాహాలకు, సతీసహగమనం కు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన సామాజిక విప్లవకారులు అని, గులాం గిరీ పుస్తకం రచించి అత్యధిక ప్రజలు మానసిక బానిసత్వం నుండి విముక్తి కావాలని అందుకు విద్యను ఆయుధంగా తీసుకోవాలి అన్నారు. వారి ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని వారిని స్పూర్తిగా తీసుకుని విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Tuesday, 25 November 2025

Constitution Day 2025 Celebrations at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం:

ఉదయం 11 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కలిసి రాజ్యాంగ పీఠిక ను పఠనం చేయడం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని 2 సం.రాల 11 నెలల 18 రోజుల్లో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన రచించడం జరిగిందని, ఇది నవంబర్ 26, 1949 లో ఆమోదించడం జరిగిందని, ఆ సందర్భంగా ఈ రోజు రాజ్రాయాంగం దినోత్సవం జరుపుకుంటున్నాం అని తెలియజేశారు. అదేవిధంగా రాజ్యంగ పీఠిక లోని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, జాతీయ సమగ్రత పదాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. కుల, మత, ప్రాంతం, లింగ భేదం లేకుండా దేశ పౌరులు అందరూ సమానంగా ఎదిగే విధంగా, సమాన గౌరవం పొందే విధంగా అన్ని రంగాల్లో అందరూ భాగస్వామ్యం అయ్యే విధంగా భారత రాజ్యాంగం ప్రాధమిక హక్కులు, దేశ భక్తి ని, దేశాభివృద్ధి లో పౌరుల భాద్యతలను తెలిపే ప్రాధమిక విధులను, అందరికీ ఆర్థికంగా, సామాజిక న్యాయం అందించడానికి ఆదేశిక సూత్రాలను పొందుపరచడం జరిగిందని, ప్రస్తుతం రాజ్యాంగం మొత్తం 470 ఆర్టికల్ లు, 12 షెడ్యూల్, 25 భాగాలుగా అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మనది అని తెలియజేశారు. రాజ్యాంగం స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని హక్కులు ఉపయోగించుకొని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.