ఈరోజు ఉదయం 9:30 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది.
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన లు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం గురించి తెలియజేస్తూ సహ పాఠ్య కార్యక్రమాలు, పాఠశాల నిర్వహణ, అభివృద్ధి సంబంధించిన పనులలో, మీ వృత్తికి సంబంధించిన విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. అదేవిధంగా ఇంటి వద్ద విద్యార్థులు చదువుకోవడానికి అనువైన గాలి వెలుతురు వచ్చేటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయాలని, టీవీ, మొబైల్ వంటి శబ్దాలు రాకుండా చూడాలని, అక్కడ వారు చదువుకోవడానికి, ఇంటి పని పూర్తి చేయడానికి ప్రోత్సహించాలని వివరించారు. విద్యార్థులు నేర్చుకున్న సామర్థ్యాల సాధన కోసం ఇంటింటా చదువుల పంట యాప్ ని ఉపయోగించాలన్నారు. ఏఐ ఆధారిత ఏ.ఎక్స్.ఎల్ డిజిటల్ లెర్నింగ్ గురించి వివరించారు.
ముఖ్య అతిథులుగా హాజరైన సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు మాట్లాడుతూ మన పిల్లల భవిష్యత్తు కోసం నెలకు ఒక రోజు నిర్వహించే ఈ సమావేశంలో తల్లిదండ్రులు అందరూ పాల్గొని వారి ప్రగతిని తెలుసుకొని పాఠశాల అభివృద్ధికి, ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాల కంటే ఈ పాఠశాలలో బాగా చదవు చెప్తున్నారని, విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రగతిని తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.