తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆకట్టుకున్న పప్పెట్రీ ప్రదర్శన:
ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలురు ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ దసరా సెలవుల్లో పిల్లలతో తల్లిదండ్రులు తగిన సమయాన్ని గడపాలని, విద్యార్థులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజూ ఒక గంట చదువుకునేలా చూడాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకునే విధంగా వారికి స్ఫూర్తివంతమైన వ్యక్తుల గురించి, కథలు చెప్పాలని, కుటుంబ విలువల గురించి వివరించాలని సూచించారు. తల్లిదండ్రులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి నిర్వహిస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలను వివరించారు.ఈ సమావేశంలో విద్యార్థులు ప్రదర్శించిన పప్పెట్రీ ప్రదర్శన అందరినీ అలరించింది. అనంతరం విద్యార్థులు వివిధ పూలను సేకరించి బతుకమ్మను పేర్చి , బతుకమ్మ పాటలకు నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.