ముందస్తు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం 8 గం.లకు దుకాణ సముదాయ కూడలి, ఉప్పునుంతలలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన, మహిళా సంఘాల సమక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం (పి.టి.ఎం) నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ మన ప్రభుత్వ పాఠశాలలో ఈ సంవత్సరం నుంచి కృత్రిమ మేధా (AI) ఆధారంగా విద్యాబోధన నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఇంగ్లీషు మీడియంలో బట్టి విధానంలో కాకుండా బోధనోపకరణాలతో కృత్యాధార పద్దతిలో అర్థవంతమైన బోధన చేస్తున్నామని, గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు వంటి వినూత్న పద్ధతుల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో చదువును అందిస్తున్నామని వివరించారు. ఈ సంవత్సరం ఎనిమిది మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారని, గత ఏడు సంవత్సరాల్లో మొత్తం 49 మంది మన పాఠశాల నుంచి గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారని తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్ లు, నోటు పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నదని వివరించారు.
పాఠశాలలో విశాల తరగతి గదుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాబట్టి మన గ్రామంలోని బడి ఈడు పిల్లలు అందరినీ మన ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని మహిళా సంఘాలను, పిల్లల తల్లిదండ్రులను కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారు మాట్లాడుతూ విషయ నిపుణులైన, సుదీర్ఘ అనుభవం కలిగిన ఉపాధ్యాయ బృందం అంకితభావంతో పనిచేసి గురుకుల సీట్లు సాధిస్తూ, ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, విద్య ద్వారానే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ గారు తన కుమారున్ని ఇదే పాఠశాలలో చదివిస్తున్నారని, కాబట్టి మన గ్రామంలోని ప్రజలు అందరు కూడా తమ పిల్లలను ఈ ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని కోరారు. అంగన్వాడీ ఉపాధ్యాయురాలు పద్మ, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment