భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి జయంతిని పురస్కరించుకుని బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఈ రోజు మధ్యాహ్నం 3గం.లకు గణిత బోధనోపకరణాల మేలా(Mathematics TLM Mela)ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ మేలాకు ముఖ్య అతిథులుగా పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్ హాజరై, గణితం అన్ని శాస్త్రాలకు తల్లి లాంటిదని గణితం ఉపయోగించకుంటే ఆ విషయంలో పరిపూర్ణత ఉండదు కాబట్టి అంతా ప్రాధాన్యత ఉన్న గణితాన్ని TLM ఉపయోగించి ఆసక్తితో నేర్చుకోవాలని, గణిత ప్రాముఖ్యతను వివరించారు. గణిత ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, పద్మావతి మేడం లు మాట్లాడుతూ అమూర్థమైన గణితాన్ని విద్యార్థులు అర్థం చేసులేక గణితం అంటే భయపడుతుంటారు. కొందరు విద్యార్థులు గణితం అర్థం చేసుకోలేక గణితం అంటే అనాసక్తి ఏర్పడి చదువు మధ్యలో ఆపేస్తుంటారు. అలాంటి గణిత భావనలను ముఖ్యంగా ప్రాథమిక స్థాయి విద్యార్థులకు అవగాహన చేయించాలంటే బోధన అభ్యసన ప్రక్రియలో భోధనోపకరణాలు/TLM వినియోగించాలి. బట్టి విధానం కాకుండా కృత్యాధార బోధన పద్దతిలో భోధనోపకరణాలు ఉపయోగించి కృత్యాల ద్వారా, ఆటల ద్వారా, పాటల ద్వారా, చేయడం ద్వారా అభ్యసనం వల్ల విద్యార్థులు భయం లేకుండా స్వేచ్ఛగా చాలా ఆసక్తిగా కృత్యాలలో పాల్గొని, ఇష్టంగా గణిత భావనలు సులువుగా అవగాహన చేసుకుంటారు, అంతేకాకుండా వాటిని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు అని వివరించారు. సంఖ్యలను పోల్చడం, చతుర్విధ ప్రక్రియలు కూడిక, తీసివేత, గుణకారం, భాగహారంలను, ఎక్కాలు, భిన్నాలు, పొడవు, బరువు, పరిమాణం, కాలం, వివిధ ఆకారాలు, వాటి చుట్టు కొలత, వైశాల్యం లను కనుగొనడం లాంటి గణిత భావనలను TLM సహాయంతో చూస్తూ, చేస్తూ సులువుగా నేర్చుకోవచ్చు అని, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను గణితం ద్వారా పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు బాలమణి మేడం లు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ గారు 33 సం.రాల తక్కువ జీవిత కాలంలోనే గణిత శాస్త్రంలో విశేష కృషి చేసి గణిత విశ్లేషణ, సంఖ్యా సిద్దాంతం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలకు సంబంధించి 3900 సూత్రాలు కనిపెట్టి గణిత మేధావి గా ప్రశంసలు పొందారు. కాబట్టి రామానుజన్ గారిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు గణితంలో, చదువులో రాణించాలని సూచించారు. ఈ గణిత మేలాలో పొరుగు పాఠశాలల HM లు విజయ్ కుమార్ సార్, నరసింహ రెడ్డి సార్, ఉపాధ్యాయులు అమీర్ పాషా సార్, భాస్కర్ సార్, CRP నరేష్ సార్ మరియు విద్యార్థులు పాల్గొని వివిధ TLMలను చూసి వాటి గురించి తెలుసుకున్నారు.